Kotha Prabhaker Reddy: బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన వ్యాఖ్యలపై ఒక్కొక్కరు కాంగ్రెస్ కీలక నేతలు స్పందిస్తూ వస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఈ రోజు (ఏప్రిల్ 15) జరిగిన బీఆర్ఎస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోరుతూ నిర్వహించిన సన్నాహక సమావేశంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన ఈ కీలక వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Kotha Prabhaker Reddy: కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందిన పలువురు బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ తమతో చెప్పుకుంటున్నారని కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలను బయటపెట్టారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తామని చెప్తున్నారని ఆయన వెల్లడించారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని ఆయన తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ పార్టీకి దరిదాపుల్లో కూడా లేదని స్పష్టం చేశారు.
Kotha Prabhaker Reddy: కొత్త ప్రభాకర్‌రెడ్డి మరో కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా ఉంటే కుదరడం లేదని, ర్యాష్‌గా ఉంటే ఎలా ఉంటుందో ఇక నుంచి తాను చూపిస్తానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని, వారి కలలు కల్లలుగానే మిగులుతాయని వారు తేల్చి చెప్పారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఐదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పారు. చూస్తూ ఉరుకోబోమని తేల్చి చెప్పారు.