Lokah Chapter 2: మలయాళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన ‘కొత్తలోక: చాప్టర్1’ కు సీక్వెల్ అధికారికంగా ప్రకటించబడింది. ఇటీవల మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేయగా, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
రూ.30 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించి, ఏకంగా రూ.267 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాక, దేశంలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా కొత్త రికార్డును నమోదు చేసింది.
ఈ చిత్రాన్ని యువ నిర్మాత దుల్కర్ సల్మాన్ నిర్మించగా, దర్శకుడు డామినిక్ అరుణ్ క్రియేటివ్‌గా తెరకెక్కించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ శక్తివంతమైన సూపర్ హీరో పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: BRS: బీఆర్ఎస్ ఎన్నికల వార్ షురూ.. కాంగ్రెస్ బాకీ కార్డుల విడుదల
ఇప్పుడు వస్తున్న ‘కొత్తలోక: చాప్టర్2’ లో ఈ ఇద్దరి పాత్రలు మరింత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమో వీడియోలో వారిద్దరి మధ్య జరిగే సంభాషణను చూపించగా, సీక్వెల్ కథ మరింత ఉత్కంఠగా ఉంటుందని అర్థమవుతోంది.
డామినిక్ అరుణ్ మళ్లీ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించబోతున్నారని చిత్రబృందం ధృవీకరించింది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటుల పూర్తి వివరాలు, విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
తెలుగులో కూడా మంచి ఆదరణ పొందిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ యూనివర్స్ కొనసాగుతుండటంతో, అభిమానులు కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.