Kota Srinivas Rao: విలక్షణ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాస్‌రావు మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. కోట కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ఆయన మరణం విచారకరమని, ఆయన నాటక, సినీ రంగాలకు చేసిన విశేష సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని వారు కొనియాడారు.
కోట పాత్రలు చిరస్మరణీయం: చంద్రబాబు
Kota Srinivas Rao: నటుడు కోట శ్రీనివాస్‌రావు నాటక, సినీ రంగాల్లో పోషించిన పాత్రలు చిరస్మరణీయమని నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. కోట మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని తెలిపారు. ఎన్నో మరుపురాని పాత్రలతో నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు.
ప్రేక్షకుల గుండెల్లో కోటది ప్రత్యేక స్థానం: నారా లోకేశ్
Kota Srinivas Rao: తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాస్‌రావు మరణం తీరనిలోటని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు కోట జీవం పోశారని కొనియాడారు. తెలుగుతోపాటు ఇతర భాషల సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవలోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.