Konda surekha: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శైవక్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శివరాత్రి ఉపవాసం పాటించే భక్తుల కోసం అన్ని ఆలయాల్లో ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలని సూచించారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, మేళ్లచెరువు, పానగళ్లు, పాలకుర్తి, వేయిస్థంభాల గుడి, కాశీబుగ్గ శివాలయం, భద్రకాళి ఆలయాల్లో మరింత పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు తాగునీరు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గోదావరి సహా నదీ పరీవాహక ప్రాంతాల్లో నదీ హారతి కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే హైదరాబాద్‌లో ఎండోమెంట్ కమిషనరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయాల వద్ద మద్యం అమ్మకాలు జరగకుండా గస్తీ ఏర్పాట్లు చేయాలని, శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా మహా శివరాత్రి పండుగను ఆధ్యాత్మికంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.