Kollu Ravindra: కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన పర్యటన పూర్తిగా విఫలమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, జగన్ పర్యటనలో ఎక్కడా నిజమైన రైతులు కనిపించలేదని అన్నారు. రైతులను పక్క గ్రామాల నుంచి తెప్పించుకుని, పొలం గట్లపై కేవలం ఫొటోల కోసం నిలబడి పబ్లిసిటీ స్టంట్లు చేశారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తుపాను వచ్చి తొమ్మిది రోజులు గడిచాక, కేవలం పరామర్శ పేరుతో రాజకీయ డ్రామాకు తెరలేపారని ఆయన ఆరోపించారు.
జగన్ పర్యటన అంతా పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, ప్రభుత్వంపై బురదజల్లడానికే ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా వర్షపు నీరు నిలవలేదని, ఎందుకంటే తమ ప్రభుత్వం పంట కాలువలను సరిగ్గా బాగు చేయడం వల్ల నీరు వెంటనే వెళ్లిపోయిందని, దీనివల్ల రైతులు కొంత నష్టాన్ని తగ్గించుకోగలిగారని ఆయన వివరించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో కాలువల్లో చారడు మట్టి కూడా తీయలేదని ఆయన గుర్తుచేశారు.
Also Read: Anasuya: అనసూయ హాట్ కామెంట్స్.. “నా వయస్సు తగ్గుతోంది, బంగారం ధర పెరుగుతోంది!”
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేశ్‌పై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదని కొల్లు రవీంద్ర అన్నారు. కన్నతల్లిని, చెల్లెలిని పట్టించుకోని వ్యక్తి, ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు.
తుపాను సమయంలో సీఎం చంద్రబాబు, లోకేశ్ ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని మంత్రి తెలిపారు. తుపాను తీరం దాటిన వెంటనే సీఎం ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలించారని, ఆ మరుసటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు తగిన సూచనలు చేశారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వేశామని, ప్రాణ నష్టం లేకుండా అధికారులు అద్భుతంగా పని చేశారని కొల్లు రవీంద్ర కొనియాడారు. కష్టపడి పని చేసిన అధికారులను అవమానపరిచేలా జగన్ మాట్లాడటం తప్పు అని ఆయన అన్నారు. వైసిపి పాలనలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన రోజులను జగన్ గుర్తు చేసుకోవాలని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా సూచించారు.

