Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చివరకు తన ఫామ్ ను తిరిగి పొందాడు. గత కొన్ని నెలలుగా పేలవమైన ఫామ్ తో కష్టాలను ఎదుర్కొన్న కోహ్లీ, ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి చక్కటి ఆట తీరును ప్రదర్శించాడు. పెర్త్ టెస్ట్ సెంచరీ తర్వాత ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ బాగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వెంటాడి ఔట్ అయ్యాడు. అయితే ఇప్పుడు తాజాగా కోహ్లీ కు మరొక బలహీనత బయటపడింది. ఇది ఎప్పటి నుండో ఉన్నదే అయినా ఇప్పుడు అతను అటువంటి బంతులకు మరింత తడబడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే…
ఈ మధ్యనే 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడిన కోహ్లీ, ఆఫ్ స్టంప్ లైన్ బంతి లోనికి వచ్చి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు కోహ్లీ బలహీనతలపై మళ్ళీ చర్చ మొదలైంది. ఆ తరువాత మోకాలి వాపుతో ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో కేవలం ఐదు పరుగులే చేసి వెనుదిరిగాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు కీలకమైన ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి తన ఫామ్ చూపించాడు. అయితే, కోహ్లీ ఫారమ్‌లోకి వచ్చినప్పటికీ, అతను రెండు వన్డేల్లో లెగ్ స్పిన్నర్ అయిన ఆదిల్ రషీద్‌కే ఔట్ అవడం ఆందోళనకు కారణమైంది.
ఇటీవలే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలతో ఇబ్బంది పడిన కోహ్లీ, ఇప్పుడు లెగ్ స్పిన్‌తో కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు లెగ్ స్పిన్ కోహ్లీకి మరో బలహీనతగా మారింది. ప్రత్యర్థి బౌలర్లు కోహ్లీ బ్యాటింగ్‌లోకి వచ్చిన వెంటనే లెగ్ స్పిన్నర్లను బౌలింగ్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
Also Read: Asteroid YR4: భూమికి భారీ ముప్పు.. ఇండియా, పాక్, బంగ్లాదేశ్‌లలో విధ్వంసం తప్పదా !
మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి క్రీజులో స్థిరపడిన తర్వాత డిఫెన్స్ చేయబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తొలి వన్డేలో కూడా అదే పద్ధతిలో ఔట్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఈ బలహీనతపై దృష్టి పెట్టకపోతే, ప్రతి జట్టు లెగ్ స్పిన్నర్‌తో కోహ్లీని ఆడించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగు సంవత్సరాలలో విరాట్ కోహ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు 11 సార్లు ఔట్ అయ్యాడు.
ఎందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే కోహ్లీ గతంలోగా లెగ్ స్పిన్ బౌలర్లను ధాటిగా ఆడలేకున్నాడు. టి20 లో చూస్తే కూడా కోహ్లీ లెగ్ స్పిన్ బౌలర్ల పై స్ట్రైక్ రేటు సుమారు 100 మాత్రమే ఉంటుంది. ప్రపంచకప్ ఫైనల్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన కోహ్లీ స్పిన్నర్లు వచ్చినప్పుడు మాత్రం వారిని సంయోచితంగా బౌండరీలు కొట్టలేకపోయాడు. ఇప్పుడు డిఫెన్స్ లో కూడా అతను క్రేజ్ కంటే మరీ ముందుగా ఫ్రంట్ ఫుట్ పైన ఆడడం అనేది అతనికి బలహీనతగా మారింది.
ముఖ్యంగా కోహ్లీ తన బ్యాక్ ఫుట్ ఆటను మర్చిపోయాడు. బంతి గుడ్ లెంత్ లో పడి బయటకు స్పిన్ తిరుగుతున్న సమయంలో మిగిలిన బ్యాటర్లు వెనుకకు వంగి కట్ లేదా ఫుల్ చేస్తారు. కానీ కోహ్లీ మాత్రం తన కాలను ముందు వేసేసి ఫ్రంట్ ఫుట్ పైన డిఫెన్స్ చేస్తుండడంతో అతని బ్యాట్ కు అవి ఎడ్జ్ తీసుకుంటున్నాయి. ఇలా కోహ్లీ తన ఆటలో బ్యాక్ ఫుట్ పైన ఎక్కువ షాట్లు ఆడకపోతే రానున్న రోజుల్లో కూడా ఇతను ఇలాగే అవుట్ అయ్యే ప్రమాదం ఎక్కువ. మరి ఎప్పటికప్పుడు తన ఆట తీరును మార్చుకుంటూ ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్ గా మారిన కోహ్లీ ఇప్పుడు ఎంత త్వరగా తప్పులను సరిదిద్దుకుంటాడో చూడాలి.