Kishan reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి సహనం, అవగాహన లేవని, అవాస్తవ ఆరోపణలతో బీజేపీని బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది – కిషన్ రెడ్డి
కేంద్రంతో కలిసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే బీజేపీపై ఎదురుదాడికి దిగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్ధిపై స్పష్టత
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదని, కేవలం రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ అర్థరహిత ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
“నేను బెదిరింపు రాజకీయాలు చేయను”
తనపై వస్తున్న బెదిరింపు ఆరోపణలను ఖండించిన కిషన్ రెడ్డి, తాను ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు. తనను తిట్టినవారిని కూడా ఎప్పుడూ వ్యక్తిగతంగా దాడి చేయలేదని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి తాను కాదని, తెలంగాణ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని కేంద్రమంత్రిపేర్కొన్నారు.