Warangal Airport: వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామనూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజాం కాలంలో వైభవంగా ప్రారంభమైన ఈ విమానాశ్రయం, కాలక్రమంలో తన ప్రాముఖ్యత కోల్పోయినా, వరంగల్ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అహర్నిశ కృషి ఫలితంగా మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా దీనిపై చర్చలు జరుగుతుండగా, ఎట్టకేలకు కేంద్రం అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే, పూర్తిస్థాయి నిర్మాణానికి మొత్తం 949 ఎకరాల భూమి అవసరమవగా, ఇప్పటికే 696 ఎకరాలను భూసేకరించారు. మిగిలిన 253 ఎకరాలను 2025 మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం వరంగల్ కలెక్టర్ 205 కోట్ల రూపాయలను కేటాయించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయితే, 2025 చివరిలో ఫ్లైట్ సేవలు ప్రారంభం కానున్నాయి.
Also Read: Aadhaar Governance: ఆధార్ ప్రామాణీకరణ కోసం కేంద్రం కొత్త పోర్టల్ ప్రారంభం
Warangal Airport: కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో ప్రధాన అవరోధంగా ఉన్న జిఎంఆర్ సంస్థతో చర్చించి సమస్యను పరిష్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల ఏర్పాటును మరింత వేగవంతం చేసింది. 1930లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం 50 ఏళ్ల పాటు సేవలు అందించింది. కానీ, 1981 తరువాత ఉపయోగం తగ్గడంతో మూతపడింది. 2020లో మళ్లీ దీనిని ప్రారంభించేందుకు చర్చలు మొదలై, చివరకు 2023లో రాష్ట్ర మంత్రివర్గం దీనికి అనుమతిచ్చింది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, దక్షిణ తెలంగాణలో వరంగల్ ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా మారనుంది. ఇది వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలకు మేలుచేస్తుందనే ఆశలు ఉన్నాయి. డిసెంబర్ నాటికి ప్రాథమిక నిర్మాణం పూర్తవుతుందని, 2025లో అధికారికంగా ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఒకప్పుడు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ విమానాశ్రయం, మరింత ఆధునికంగా రూపుదిద్దుకుని, వరంగల్ ప్రజల ఆశల్ని నిజం చేయబోతోంది.