Kidnap Case: ఇది నిజంగా ప్రతి ఇంటా భయంగొలిపే విషయం. ఎక్కడా, ఎవరికీ జరగకూడదని కోరుకునే అంశం. ఏ ఆడకూతురు కూడా ఈ విషవలయంలో చిక్కుకోవద్దని భావించే సందర్భం. ఆడపిల్ల ఉన్న ఏ ఇల్లు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ వేడుకునే సమయం. పాఠశాలకు వెళ్లే మన పిల్లలూ క్షేమమేనా? అని ప్రశ్నించుకోవాల్సిన దుర్గతి పట్టింది. ఓ దుర్మార్గురాలి దురాగతాలకు ఎందరో పసిపిల్లలు బలైన ఘోరాలు వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నది. చారిత్రక నగరమైన వరంగల్ నడిబొడ్డున జరిగిన ఈ దురాగతాలు తాజాగా బయటకు పొక్కడంతో ఈ పైప్రశ్నలు ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తున్నాయి.
Kidnap Case: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పరిధిలో గత కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నది. డ్రగ్స్‌కు బానిసైన ఆ కిలేడీ తనతోపాటు డ్రగ్స్‌కు బానిసగా మారిన మరో అమ్మాయితో స్నేహం చేసింది. వీరిద్దిరికీ తోడుగా మరో నలుగురు యువకులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ ముఠా దురాగతాలకు ఒడిగట్టింది.
Kidnap Case: వరంగల్ నగరంలోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద ఈ ముఠా రెక్కీ నిర్వహించేది. పాఠశాలకు వెళ్లొచ్చే వేళల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో ఈ కిలేడీ మాటలు కలిపి వారికి దగ్గరయ్యేది. వారితో చనువు పెంచుకునేది. కలివిడిగా ఉన్నట్టు నటిస్తూ ఏకంగా అలాంటి బాలికలను కిడ్నాప్ చేస్తుంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి, అప్పటికే తన, తన గ్యాంగ్‌కు టచ్‌లో ఉన్న మానవ మృగాలకు వారి శీలాన్ని అమ్మేస్తుంది.
Kidnap Case: బాలికలు మత్తులో ఉండగానే డబ్బు వెదజల్లిన ఆ మానవ మృగాలు తమ కామ వాంఛ తీర్చుకునేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే ఆ దుర్మార్గురాలు, తన ముఠాతో కలిసి ఆ బాలికలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఇది దాదాపు ఏడాదిన్నరగా ఈ ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ముఠా బారిన పడిన ఎందరో బాలికల జీవితాలను నాశనం చేసింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, పక్క జిల్లాలకూ తరలించి ఘోరాలకు ఒడిగట్టినట్టు సమాచారం.
ముఠా ఘోరాలు బయట పడింది ఇలా?
Kidnap Case: ఈ ముఠా దారుణాలు కొనసాగుతుండగానే మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక అదృశ్యమైంది. ఈ మేరకు ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దశలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకు ఏం జరిగిందో తెలియదని ఆబాలిక చెప్పింది. తాను స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. ఆ తర్వాత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టు తేలిందని సమాచారం.
Kidnap Case: ఆ బాలిక అదృశ్యం తర్వాత ఆ కిలేడీ ముఠా దురాగతాలు బట్టబయలయ్యాయి. బాధిత బాలిక చెప్పిన వివరాల ప్రకారం, ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆ మేరకు సదరు కిలాడీ లేడీ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. చూశారా.. మన పిల్లలు బడికి వెళ్లినా, బయటకు వెళ్లినా, జాగ్రత్తలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. మన పక్కనే ఉండి అభం శుభం తెలియని ఆడపిల్లలపై ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుంటే.. ఆడపిల్లల భతుకు భద్రమేనా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సి వస్తున్నది.

