KCR: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి నూతన విగ్రహావిష్కరణపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నూతన విగ్రహం ఏర్పాటుపై కవులు, గాయకులు, కళాకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సాహితీవేత్త జూలురు గౌరీశంకర్ ఏకంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ దశలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
KCR: కేసీఆర్ సారధ్యంలో 2006లో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని పూర్తిగా మార్చి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించాల్సిన అంశాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడంపై ఆయన మాట్లాడారు.
KCR: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు నిర్ణయం మూర్ఖపు చర్య అని విమర్శించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు. తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలే తప్ప విగ్రహాల రూపాన్ని మార్చవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.