KCR: ఇన్నాళ్లు ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 21న హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగే కీలక సమావేశంలో జరిగే చర్చల్లో నిర్ణయించనున్నారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షం, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ రెండు సమావేశాల్లో కేసీఆర్ జనంబాట పట్టే ప్రణాళికలను రూపొందించనున్నారు.
KCR: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం ఒకటి, రెండుసార్లు మినహా ఆయన పూర్తిగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. వరంగల్‌లో జరిగిన బహిరంగ సభ కోసం ఆయన జనంలోకి వచ్చారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలను ఫామ్‌హౌజ్ నుంచే కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. పార్టీ వ్యూహ, ప్రతి వ్యూహాలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ పోరాట కార్యక్రమాలను సైతం ఆయన అక్కడి నుంచే ప్లాన్ చేసి, కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు.
KCR: ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ఆయన తీసుకునే నిర్ణయాలపై అంతటా ఆసక్తి పెరిగింది. సుదీర్ఘ కాలం అనంతరం కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమవడంతో ఇటు సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ క్యాడర్‌తోపాటు అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలోనూ క్యూరియాసిటీ పెరిగింది.
KCR: తెలంగాణ భవన్‌లో ఆదివారం (డిసెంబర్ 21న) మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కీలక సమావేశంపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం మరో ప్రజా ఉద్యమం చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ ఫ్రత్యక్ష పోరుకు దిగాలని, దానికోసం ఉద్యమరూపాలపై ఈ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడీని అడ్డుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలను గుప్పిస్తున్నది.
KCR: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై కేసీఆర్ పాల్గొనే ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కార్యవర్గాల వరకూ, ఇతర సంస్థాగత నియామకాలపై ప్రకటించే అవకాశం ఉన్నది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతారని, ప్రభుత్వంపై చేపట్టే ఉద్యమ రూపాలను వెల్లడిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
KCR: ఇప్పటికే కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్ నగరంలోని నందిహిల్స్‌లోని తన స్వగృహానికి శనివారమే చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఒకరోజు ముందే నగరానికి చేరుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో చాలాకాలం తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నది.

