KCR: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 21) ఎంగిలి పూలతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ పల్లెలు, పట్టణాల్లో మహిళలు, పిల్లలతో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక శోభను తీసుకొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కష్టాల నుంచి బయటపడి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రకృతి మాత బతుకమ్మను తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.