Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. మార్చి–ఏప్రిల్లో పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు అబద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం ఏప్రిల్ 13తో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయంగా కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికేనని చెప్పారు. ప్రజల్లో నేరుగా ఉండి, సంస్థను బలోపేతం చేయాలన్నదే లక్ష్యమని కవిత వెల్లడించారు.
ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కవిత తీవ్ర విమర్శలు చేశారు. పత్తి రైతుల సమస్యలపై ప్రభుత్వం కన్నా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని మండిపడ్డారు. మొంథా తుపాను ప్రభావంతో పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు నష్టపోతున్నప్పటికీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు.
పత్తిలో తేమ శాతాన్ని 20–25% వరకు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు తెలిపారు. వరంగల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు అమలు కాలేదని కూడా విమర్శించారు.
అదే విధంగా, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. దీని వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల బంద్కు తెలంగాణ జాగృతి పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

