Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కు అనూహ్యంగా బీజేపీ నేత నుంచి మద్దతు లభించింది. కరూర్ లో ప్రణాళిక ప్రకారమే తొక్కిసలాటను సృష్టించారని బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్… సీఎం స్టాలిన్ నేతృత్వంలోని DMK ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. విజయ్ ర్యాలీ నిర్వహించుకునేందుకు సరైన స్థలాన్ని కేటాయించలేదని ఖుష్బూ మండిపడ్డారు. ఈ ఘటన నిర్లక్ష్యం వల్లే జరిగిందని తమిళనాడు ప్రజలందరికీ తెలుసనీ…, విజయ్ సభకు జనం ఎలా వస్తారో తెలిసి కూడా సరైన భద్రత కల్పించలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా స్టాలిన్… తన మౌనాన్ని వీడాలన్నారు. అసలు తొక్కిసలాటకు ముందు పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారో చెప్పాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు. పార్టీ స్థాపించిన తర్వాత విజయ్… డీఎంకేతో పాటు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఐతే 41 మంది మృతి చెందిన కరూర్ ఘటన తర్వాత విజయ్ పార్టీని… బీజేపీ సంప్రదించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్ కు కోట్లాది మంది అభిమానులు ఉండటంతో ఆయన్ను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు… విశ్వసనీయ వర్గాలు తెలిపాయని వార్తలు వివరించాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి విజయ్ పార్టీ బీ-టీమ్ అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Chandrababu Naidu: అనంతపురంలో శిశు మృతి, కురుపాం విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు ఆరా!
తమిళనాడులోని కరూర్ జిల్లాలో సెప్టెంబర్ 27, 2025న నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట (స్టాంపీడ్) ఒక విషాదకర సంఘటన. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు.సభకు అనుమతించిన దానికంటే (10,000) సుమారు 25,000 నుండి 27,000 మందికి పైగా జనం వచ్చారు. విజయ్ సభకు ఆలస్యంగా (దాదాపు 7 గంటలకు పైగా ఆలస్యం) రావడంతో, జనం ఉదయం నుండి వేచి ఉండి, ఆయన రాగానే ఒక్కసారిగా ముందుకు దూసుకురావడానికి ప్రయత్నించారు.సరిగా ప్రణాళిక లేకపోవడం, బారికేడ్లు సరిగా లేకపోవడం, భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం వంటివి కూడా కారణాలుగా చెబుతున్నారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు విజయ్ ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ఫ్లడ్లైట్లు ఆగిపోవడం లేదా జనరేటర్ ఆగిపోవడం, ఒక బిడ్డ తప్పిపోయిందని ప్రకటన రావడంతో జనం మరింత భయాందోళన చెందడం వంటివి కూడా తొక్కిసలాటకు దారి తీశాయని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను విచారణ కోసం ఏర్పాటు చేసింది. TVK పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఎన్. ఆనంద్ తో సహా పలువురిపై పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.