Karnataka

Karnataka: బైక్ టాక్సీ సర్వీసులకు షాక్.. నిలిపేయాలని ఆదేశించిన కోర్టు!

Karnataka: కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను హైకోర్టు ఆరు వారాల పాటు నిషేధించడంతో, ఈ నిషేధం శాశ్వతంగా ఉండాలా వద్దా అనే దానిపై ప్రజా, ఆటో డ్రైవర్ల సంఘాలు కోర్టుకు తమ అభిప్రాయాలను తెలియచేశాయి. నాలుగు సంవత్సరాల క్రితం వరకు ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి బస్సు, ఆటో లేదా టాక్సీలలో ప్రయాణించేవారు.
కానీ ఇప్పుడు వాళ్ళు బైక్ టాక్సీలలో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఐటీ – బహుళజాతి కంపెనీలలో పనిచేసే వారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

బైక్ టాక్సీలు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా, వీలైనంత తక్కువ సమయంలో తమ గమ్యస్థానానికి తీసుకెళ్లగల వాహనం అని వారు నమ్ముతారు. అంతేకాకుండా ఒక్కరు వెళ్లడం కోసం ఆటోలు లేదా టాక్సీలకు ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే.. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బైక్ టాక్సీ సేవలు బాగా విస్తరిస్తున్నాయి.

సాధారణంగా, ఎవరైనా అద్దె వాహనం నడపాలనుకుంటే, రవాణా శాఖ నిబంధనల ప్రకారం, వాహనాలకు ఎల్లో కలర్ లైసెన్స్ ప్లేట్లు ఉండాలి. కానీ బైక్ టాక్సీ డ్రైవర్లు తమ సొంత వాహనాలను ఉపయోగిస్తారు. ఇది టాక్సీలు, ఆటో డ్రైవర్లకు పెద్ద దెబ్బగా మారింది.

Karnataka: కర్ణాటక రాజధాని బెంగళూరులో బైక్ టాక్సీ సేవలను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బైక్ టాక్సీలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు తరచుగా నిరసనలు చేపడుతున్నారు. “మా జీవనోపాధితో చెలగాటం ఆడకండి” అని ఆటో డ్రైవర్లు బైక్ టాక్సీ డ్రైవర్లతో గొడవలకు దిగుతున్నారు. “కుటుంబం ఉన్నది మీ ఒక్కడికేనా? మేము కూడా బతుకుదెరువు కోసం బైక్ టాక్సీలు నడుపుతాము” అని బైక్ టాక్సీ డ్రైవర్లు అంటున్నారు.

Also Read: Madhya Pradesh: విషాదం: పండగ కోసం బావిని శుభ్రం చేస్తుండగా 8 మంది మృతి!

అదే సమయంలో, బెంగళూరులో కొంతమంది బైక్ టాక్సీ డ్రైవర్లు మహిళా ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా జరిగాయి. 2022లో ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ఒక యువతిపై బైక్ టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడు. బైక్ టాక్సీలు త్వరగా ప్రయాణించడానికి ఒక మార్గం అయినా.. ప్రయాణికులు కూడా వాటితో రిస్క్ కూడా ఉంటుందనేది అందరూ అంగీకరిస్తున్నారు.

Karnataka: ఈ పరిస్థితిలో, ‘ఉబర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’తో సహా కొన్ని కంపెనీలు బైక్‌లను రవాణా వాహనాలుగా నమోదు చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి చేసిన దరఖాస్తుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శ్యామ్ ప్రసాద్, ‘తగిన ప్రభుత్వ నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు, బైక్ టాక్సీలను రవాణా వాహనాలుగా నమోదు చేయమని లేదా సేవలకు లైసెన్స్‌లు జారీ చేయమని రవాణా శాఖను ఆదేశించలేము’ అని అన్నారు.

నిబంధనలు లేకుండా బైక్ టాక్సీలు నడపడానికి అనుమతించబడవు స్పష్టం చేశారు. ఇప్పుడు ఓలా, ఉబర్, బైక్ టాక్సీ సేవలను రాబోయే ఆరు వారాల పాటు నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనిని నిర్ధారించాలి. ప్రభుత్వం కూడా అవసరమైన నియమాలను రూపొందించడానికి చర్యలు తీసుకోవాలి, అని ఆయన జస్టిస్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *