Karnataka: కర్నాటకలోని హవేరీ జిల్లాలో చోటుచేసుకున్న ఓ వైద్య వివాదం ఆందోళన కలిగిస్తోంది. జనవరి 14న, హనగల్ తాలూకాలోని అడూర్‌లో ఓ ఏడేళ్ల బాలుడు గాయపడగా, అతని తల్లిదండ్రులు ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే, బాధిత బాలుడికి కుట్లు వేయాల్సిన అవసరం ఉండగా, నర్సు జ్యోతి కుట్లుకు బదులుగా ఫెవిక్విక్ రాసింది.
.బాలుడి తల్లిదండ్రులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా, నర్సు దీన్ని సరైన చికిత్సగానే సమర్థించుకుంది. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన తల్లిదండ్రులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పందించి, నర్సుపై విచారణ చేపట్టింది. తొలుత ఆమెను బదిలీ చేయగా, అనంతరం ఉదంతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నర్సు జ్యోతిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి:US Dollar vs Indian Rupee: డాలరుతో రూపాయి దారుణంగా విలువ పడిపోతోంది.. అందుకు కారణాలివే.. కరెన్సీ విలువ ఎలా లెక్కిస్తారంటే..
ఆరోగ్య శాఖ అధికారులు ఫెవిక్విక్ వంటి పదార్థాలను వైద్య చికిత్సలో ఉపయోగించడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నర్సు తప్పుడు చికిత్స అందించినట్లు నిర్ధారణ కావడంతో, మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, బాలుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.