Kanimoli: తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం ప్రకటించిన నేపథ్యంలో, అధికార డీఎంకే పార్టీతో ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) మధ్య వాగ్వాదం రాజుకుంది. ఈ క్రమంలో డీఎంకే ఎంపీ కనిమొళి సినీనటుడు విజయ్ను లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎట్టాయపురంలో జరిగిన పార్టీ సమావేశంలో, ఆమె మాట్లాడుతూ – ‘‘రాజకీయ అనుభవం లేని కొంతమంది వ్యక్తులు ఆకస్మికంగా రాజకీయ రంగంలోకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న తేడాలను కూడా బోధపడకుండా ప్రశ్నలు వేస్తున్నారు’’ అని విమర్శించారు.
ప్రజల పక్షాన నిజమైన పోరాటం చేయాలంటే ముందుగా వారి సమస్యలు, రాజకీయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పరిపాలన వ్యవస్థపై స్పష్టత లేకుండా ఎవరైనా ఎన్నికల హామీలు ఇవ్వడం సరైనది కాదని ఆమె వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు రాజకీయాల్లో విస్తృత అనుభవం ఉందని పేర్కొంటూ, ప్రజలకు అటువంటి నాయకత్వమే అవసరమని కనిమొళి స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇకపోతే, వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరఫున విజయ్ సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అదేవిధంగా, తమ పార్టీ డీఎంకే, బీజేపీలతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదని విజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కనిమొళి వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

