Kangana Ranaut: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు పంజాబ్‌లోని భటిండా కోర్టులో భారీ ఊరట లభించింది. రైతు ఉద్యమకారిణి మహిందర్ కౌర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సోమవారం (అక్టోబర్ 27, 2025) కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన కంగనా రనౌత్, తన సోషల్ మీడియా పోస్ట్ వల్ల తలెత్తిన అపార్థం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా హాజరైన కంగనా, కేసు గురించి విలేకరులతో మాట్లాడారు.మహిందర్ కౌర్ గారి కుటుంబంతో ఏదైతే అపార్థం జరిగిందో, దాని గురించి ‘మాతాజీ’ (మహిందర్ కౌర్) భర్తకు నేను సందేశం పంపాను. ఇలాంటి వివాదం సృష్టించబడుతుందని కలలో కూడా ఊహించలేదు” అని కంగనా అన్నారు. పంజాబ్ నుంచైనా, హిమాచల్ నుంచైనా, ప్రతీ అమ్మ నాకు గౌరవనీయురాలే అని ఆమె స్పష్టం చేశారు. తన పోస్ట్ వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి చేసింది కాదని ఆమె వివరించారు. అది కేవలం ఒక ‘రీట్వీట్’ అని, దాన్ని కొందరు ‘మీమ్’ గా వాడుకున్నారని తెలిపారు. తాను కేవలం ఆ అపార్థానికి చింతిస్తున్నానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Montha Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు.. పత్తిపై ఎఫెక్ట్
రైతు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు నిరసనలు చేస్తున్న సమయంలో, నిరసనల్లో పాల్గొన్న 73 ఏళ్ల వృద్ధురాలు మహిందర్ కౌర్ను ఉద్దేశించి కంగనా రనౌత్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్ట్‌లో వృద్ధురాలిని షాహీన్ బాగ్ నిరసనకారి బిల్కిస్ బానోగా పొరబడి, కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహిందర్ కౌర్ 2021లో పరువు నష్టం దావా వేశారు.
న్యాయమూర్తి ఆదేశాల మేరకు కంగనా తండ్రి ఇచ్చిన పూచీకత్తుపై కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 24కి వాయిదా పడింది. కోర్టు బయట కంగనా ఇచ్చిన క్షమాపణను అంగీకరించాలా వద్దా అనే దానిపై మహిందర్ కౌర్ భర్త కుటుంబంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

