Kalvakuntla Kavitha: బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపైనా ఆమె విమర్శల వర్షం కురిపించారు. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్న కవిత.. ఏర్పాటు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Kalvakuntla Kavitha: స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిందని, పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని గతంలో ఎంపీ అర్వింద్ అన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మరి బెంజ్ కారు ఉంటే అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టని కవిత ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడటం మానాలని ఆమె హితవు పలికారు.
Kalvakuntla Kavitha: పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, దానిని ప్రకటించిన విధానమే ఆక్షేపణీయమని కవిత పేర్కొన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ పార్టీ కార్యక్రమంలా జరపడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ పాటించలేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదని, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు కూర్చొని బోర్డును ప్రారంభించుకున్నారని ఆరోపించారు.
Kalvakuntla Kavitha: ఎంపీ అర్వింద్ వెకిలిగా మాట్లాడటం అలవాటని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే ఈ ప్రాంత పసుపు రైతుల సమస్యలన్నీ తీరిపోవని, పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తేనే సరైన న్యాయం జరుగుతుందని చెప్పారు. తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లోనే లేరని గుర్తు చేశారు. ఎవరు ఏమీ చేయకున్నా మూడేండ్లకోసారి ధరలు పెరుగుతాయని, తన వల్లే పసుపు ధర పెరిగిందని అర్వింద్ చెప్పుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు.