Kalisetti Appalanaidu: విశాఖపట్నం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, “పులివెందుల ఎమ్మెల్యే ప్రసంగం పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. అందులో ఒక్క మాట కూడా నిజం లేదు” అని విమర్శించారు.
జగన్ వ్యాఖ్యలు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకూ అవమానంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. “జగన్ ఆన్ పార్లమెంటరీ భాషలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం” అని కలిశెట్టి తెలిపారు.
విశాఖపై జగన్ వైఖరిపై ప్రశ్నలు
విశాఖలో డేటా సెంటర్ పై జగన్ వ్యాఖ్యలు అనుచితమని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కత్తులు పట్టుకున్నవాడికి కంప్యూటర్ అంటే ఏమి తెలుసు? డేటా సెంటర్ శంకుస్థాపన మీరు చేశారు కదా, అయితే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేదేంటి?” అంటూ ప్రశ్నించారు. విశాఖలో గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు రాకుండా వైసీపీ అడ్డుకుందని, పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించలేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Sleeping with Socks: సాక్సులు వేసుకుని నిద్రించడం మంచిదా, కాదా?
“వైసీపీ విశాఖను దోచుకుంది”
“పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ నేతలు విశాఖను దోచుకున్నారు. ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయింది” అని కలిశెట్టి మండిపడ్డారు. జగన్ సర్కార్ పెట్టుబడులను అడ్డుకున్నదని, చంద్రబాబు హస్తం కనిపిస్తే పెట్టుబడులు వస్తుంటే… జగన్ టీమ్ వాటిని ఆపేందుకు మెయిల్స్ పంపిందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబును అభివృద్ధి చిహ్నంగా పేర్కొన్న ఎంపీ
హైదరాబాద్ అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబేనని, ఆయన అభివృద్ధి చలవే తెలంగాణలో కూడా అంగీకరించబడుతోందని ఎంపీ పేర్కొన్నారు. “జగన్ వన్ టైమ్ సీఎం, కానీ చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయ్యారు. అది నాయకత్వంలో ఉన్న తేడా” అని కలిశెట్టి వ్యాఖ్యానించారు. మద్యపానంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని కూడా ఆయన ఎద్దేవా చేశారు.