jubliee hills By elections 2025: ఆ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భయం పట్టుకుందా? ప్రభుత్వ వ్యతిరేకత, సమర్థత అంతా ఆ ఎన్నికలో బయట పడుతుందా? ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ప్రజల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్త ప్రజాభిప్రాయం వ్యక్తమైనట్టేనా? అధికార పార్టీ ఓడిపోతే ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న ప్రచారం మొదలవుతుందా? ప్రతిపక్షం ఓటమి పాలైతే అధికార పార్టీ పథకాలకే ప్రజలు జైకొట్టినట్టు అవుతుందా? అన్న విషయాలపై ప్రత్యేక కథనం.
jubliee hills By elections 2025: తొలుత అధికార పార్టీ కాంగ్రెస్ గురించి విశ్లేషిద్దాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. చాలావరకు విస్మరించిందని ప్రజల్లో నాటుకుపోయింది. ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని విస్మయం వ్యక్తమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఇతర హామీల అమల్లో విఫలమైందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పై భారీగా ఆశలు పెట్టుకొని గెలిపించిన ప్రజలు.. ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
jubliee hills By elections 2025: మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెలా ఇస్తానన్న రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్ దగ్గర్నుంచి ఇందిరమ్మ ఇండ్ల దాకా దేనినీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోతోంది. పైగా, వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫార్ములా ఈ- కారు రేసులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్.. ఇలా పలు అంశాలను తెరపైకి తెస్తూ ప్రభుత్వం చేయాల్సిన పని నుంచి తప్పించుకుంటున్నదని ప్రతిపక్షాలతో సహా ప్రజలు కూడా విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం మరో ఎత్తు. ఇది హైదరాబాద్ నగరంలో పేదల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
jubliee hills By elections 2025: రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటైన వెంటనే పేదల ఇళ్లపై గురిపెట్టింది. హైడ్రా పేరుతో కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టింది. చెరువుల ఎఫ్ టీఎల్ పరిధిలో కట్టారని, బఫర్ జోన్లో కట్టారని, అక్రమంగా అనుమతులు పొందారని, నాలాలను ఆక్రమించారని.. ఇలా పలు రకాల కారణాలు చూపుతూ రాత్రికి రాత్రే ఇళ్ల కూల్చివేతలను చేపట్టింది. రెక్కలు ముక్కలు చేసుకొని, ఒక్కో రూపాయి పోగేసుకొని., తమకు చేతనైనంతలో చిన్న గూడు కట్టుకొని ఉంటున్న పేదలను నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపాలు చేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో మరోసారి పేదలపై విరుచుకుపడింది. మూసీ ఒడ్డున కట్టుకున్నారంటూ వందల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేసి వేల మందిని నిరాశ్రయులను చేసింది.
jubliee hills By elections 2025: రేవంత్ సర్కారు చేపట్టిన ఇళ్ల కూల్చివేతలకు బలైన పేదల ఆక్రందన ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆ పేదల ఆక్రందనను పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ కూల్చివేతలు చేపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొందరు పెద్దలకు సంబంధించిన అక్రమ కట్టడాలను మాత్రం హైడ్రా ముట్టుకోలేదని బాధితులు, ప్రతిపక్షాలు ఆధారాలను చూపుతున్నారు. సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ ను మాత్రం తొలిరోజే కూల్చి.. సినీ పరిశ్రమను తమ గుప్పిట్లోకి వచ్చేలా భయపెట్టిందని గుసగుసలు.
jubliee hills By elections 2025: తమ ఇళ్లను కూల్చి.. తమకు నిలువ నీడ లేకుండా చేసిన ప్రభుత్వంపై పేద వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. అయితే ఇదే సమయంలో.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందడంతో ఆ నియజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అక్కడ సంపన్నుల కంటే నిరుపేదలే ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటారు. అత్యధిక శాతం ఓటర్లు కూడా పేదలే ఉంటారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేది పేదలే. దీంతో కాంగ్రెస్ సర్కారు చేసిన కూల్చివేతల ప్రభావం రానున్న ఉప ఎన్నిక పై పడుతుందని ఆ పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. పేదల వ్యతిరేక ఓటుతో ఓటమి తప్పదా? అనే గుబులు నెలకొన్నది.
jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి ఓటమి తప్పదని తేలినట్లు ప్రచారం జరుగుతుంది. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా పరాజయం చెందడం ఖాయమని స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో చివరికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బరిలోకి దించాలనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ చేస్తోందని సమాచారం. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
jubliee hills By elections 2025: అయితే హైడ్రా చేపట్టిన కూల్చివేతను దానం బహిరంగంగా వ్యతిరేకించారు. అక్కడి పేదల తరఫున నిలబడే ప్రయత్నం చేశారు. దీంతో ఆయా బస్తీల్లోని పేదలకు దానం పట్ల అభిమానం ఉంది. ఈ నేపథ్యంలోనే దానంకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తే ఓటమిని తప్పించుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మెడపై ఫిరాయింపుల నిరోధక చట్టం కత్తి వేలాడుతుండడంతో.. ప్రస్తుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అనర్హత వేటునుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.