Jubilee Hills:

Jubilee Hills: మీరు ఓటేయ‌లేదా? డ‌బ్బు తిరిగివ్వండి! జూబ్లీహిల్స్‌లో ఓటేయని వారిపై నేత‌ల టార్గెట్‌

Jubilee Hills: ఓటేయ‌కుంటే ఏమ‌వుతుంది? డ‌బ్బులైతే తీసుకున్నం. ఎవ‌రేం అనుకుంట‌రు? అయినా ఎవ‌రికి తెలుస్తుంది? మేమే ఓటేయ‌లేదని.. అని అనుకున్న వారు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఇప్పుడు ఓటు వేయ‌ని వారి నుంచి ఇచ్చిన డ‌బ్బును తిరిగి రాబ‌ట్టేందుకు ఇచ్చిన పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. బ‌స్తీలు, కాల‌నీలు, అపార్ట్‌మెంట్ల‌లో ఉండే స్థానిక నాయ‌కులు రంగంలోకి దిగి ఓటు వేయ‌ని వారిని ఎందుకు వేయ‌లేదంటూ నిల‌దీస్తున్నారు. దీంతో డ‌బ్బులు తీసుకొని ఓటేయ‌ని ఓట‌ర్లు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో పెద్ద ఎత్తున ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచిపెట్టార‌ని ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఒక పార్టీని మించి మ‌రో పార్టీ న‌గ‌దు పంచింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఒక‌రు ఓటుకు రూ.1,000 చొప్పున పంచారంటే, ఇంకో పార్టీ రూ.2,000 నుంచి రూ.5,000 వ‌ర‌కు పంచింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీంతో చాలా మంది డ‌బ్బుకు ఆశ‌ప‌డి ఇరుపార్టీల వ‌ద్ద తీసుకున్నారు. ఓటేసిన వారు త‌మ‌కు నచ్చిన పార్టీకి ఓటు వేసుకోగా, ఓటేయ‌ని వారికి ఇప్పుడు మూడిన‌ట్టేన‌ని తెలుస్తున్న‌ది.

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో అతి త‌క్కువ ఓటింగ్ శాతం న‌మోదైంది. స‌గం ఓట‌ర్లు కూడా ఓటేయ‌డానికి రాకపోవ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం 48.49 శాతం మాత్ర‌మే ఓటింగ్ శాతం న‌మోదైంది. ఈ స‌గానికి పైగా ఓటేయ‌ని వారిలో కొంద‌రు ఆయా పార్టీల వ‌ద్ద న‌గ‌దు తీసుకొని కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలాంటి వారి కోసం నాయ‌కులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. పోలింగ్ బూత్ జాబితా ప్ర‌కారం.. ఓటు వేయ‌ని వారిని గుర్తించి, డ‌బ్బులిచ్చి ఉంటే ఇండ్ల‌కు వెళ్లి మ‌రీ నిల‌దీస్తున్నారు. దీంతో న‌డిబ‌జారులో దోషులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తున్న‌ది.

Jubilee Hills: ఉదాహ‌ర‌ణకు ఎస్పీఆర్ హిల్స్‌లోని ఓ కుటుంబం 18 ఓట్ల‌కు గాను సుమారు రూ.45 వేలు తీసుకున్న‌ద‌ట‌. వారిలో కేవ‌లం న‌లుగురే ఓటు వేశార‌ని స్థానిక నాయ‌కులు గుర్తించారు. మిగ‌తా 14 మందికి ఇచ్చిన న‌గ‌దును వెంట‌నే తిరిగి ఇవ్వాలంటూ ఏకంగా ఆ ఇంటికి వెళ్లి ఒత్తిడి తెస్తున్న‌ట్టు తెలిసింది. అదే విధంగా ఎర్ర‌గ‌డ్డ‌, ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్‌, యూసుఫ్‌గూడ డివిజ‌న్ల‌లో ఈ పరిస్థితి ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్టు స‌మాచారం.

Jubilee Hills: ఓటేయ‌ని వారి వ్య‌వ‌హారం అపార్ట్‌మెంట్ల‌లోనూ త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతున్న‌ది. మ‌ధురాన‌గ‌ర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓటు వేయ‌ని వారి జాబితాను పార్టీ నాయ‌కులు అపార్ట్‌మెంట్ క‌మిటీ పెద్ద‌ల‌కు అందించారు. దీంతో ఆ క‌మిటీ స‌భ్యులు స‌మావేశ‌మై డ‌బ్బులు తీసుకొని ఓటేయ‌ని వారు ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తే, ఆ న‌గ‌దును అపార్ట్‌మెంట్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కు వినియోగించాల‌ని తీర్మానించిన‌ట్టు తెలిసింది. ఇదే విధంగా వివిధ కాల‌నీల‌లో పెద్ద‌లు వ‌సూలు చేసుకొని కాల‌నీల ఖ‌ర్చుల‌కు వినియోగించాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *