Jubilee Hills

Jubilee Hills: ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కోలుకోలేని మచ్చ.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!

Jubilee Hills: ఒకవైపు తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తోందని, ప్రజలకు అండగా నిలుస్తోందని ప్రశంసలు అందుకుంటోంది. కానీ, రక్షణ కల్పించాల్సిన కొందరు అధికారులు మాత్రం తమ అక్రమాలు, అనైతిక ప్రవర్తనతో నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన బాధితురాలినే లొంగదీసుకొని వేధించిన ఘటనలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) యు. శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్ కావడం శాఖలో తీవ్ర కలకలం రేపింది.

1. న్యాయం కోసం వస్తే.. నరకం చూపించాడు!

ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. ఒక సమస్యపై న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాయమాటలతో లొంగదీసుకున్నాడు.

ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫొటోలు, వీడియోలు సేకరించాడు.ఆ తర్వాత ఆ దృశ్యాలను అడ్డం పెట్టుకుని, బయటపెడతానని బెదిరిస్తూ బాధితురాలి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడని సదరు మహిళ ఆరోపించింది.అంతేకాకుండా, తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

2. కమిషనర్ సీరియస్.. సీఐ సస్పెన్షన్

బాధితురాలి ఫిర్యాదును అత్యంత తీవ్రంగా పరిగణించిన సీపీ సజ్జనార్, వెంటనే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ నివేదికలో ఆరోపణలకు బలం చేకూరడంతో ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, ఆ మహిళే తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిందని సదరు ఇన్‌స్పెక్టర్ ఉన్నతాధికారుల వద్ద వాపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *