Jalli kattu: తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి ఎంత ముఖ్యమో, తమిళనాడుకు పొంగల్ పండుగ కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు ప్రధాన ఆకర్షణగా ఉంటే, తమిళనాడులో జల్లికట్టు పేరిట ఎద్దులతో జరిగే సాహస క్రీడ ప్రత్యేకంగా నిలుస్తుంది. తమిళనాడు సంస్కృతి సంప్రదాయాల్లో, పొంగల్ పండుగ సందర్భంగా జల్లికట్టు పోటీకి విశిష్ట స్థానం ఉంది.
ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, తమిళనాడులో జల్లికట్టు పోటీలకు తెరలేచింది. ఈ పోటీల్లో ముఖ్యంగా మధురై జిల్లాలోని అవనియపురంలో జరిగే జల్లికట్టు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అవనియపురంలోని ఈ పోటీల కోసం 1,100 ఎద్దులను సిద్ధం చేశారు. ఈ మదమయిన ఎద్దుల కొమ్ములు వంచేందుకు 900 మంది పోటీదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
పోటీలో ఎవరికీ లొంగకుండా పరుగు తీసే ఎద్దు యజమానికి మొదటి బహుమతిగా రూ.11 లక్షల విలువైన ట్రాక్టర్‌ను బహూకరించనున్నారు. అదే విధంగా, ఎద్దును సమర్థంగా కట్టడి చేసి విజేతగా నిలిచిన యోధుడికి రూ.8 లక్షల విలువైన కారును బహుమతిగా అందించనున్నారు.