Champions Trophy 2025: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మేటి ఫాస్ట్ బౌలర్ బుమ్రా(Jasprit Bumrah) ఆడతాడో లేదో అనే ప్రశ్న నివృత్తమైంది. అతని స్థానంలో యువ బౌలర్ (Harshit Rana)హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ(BCCI) ఎంపిక కమిటీ నిర్ణయించింది. మరోవైపు, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కూడా తుది జట్టులో స్థానం సాధించలేదు. అతనిని ప్రయాణం చేయని సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఎంపిక చేశారు. అతని స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. గాయం కారణంగా బుమ్రా ఈ మెగా టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధంగా లేకపోవడంతో చివరి నిమిషం వరకు వేచి ఉన్న భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
నిజానికి, ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన బుమ్రాకు మొదట ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కింది. నిర్ణీత గడువులోగా అతను పూర్తి స్థాయిలో కోలుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలని నిర్ణయించారు. అతను పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో వైద్యం అందించారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రత్యేక డాక్టర్ కూడా బుమ్రాకు చికిత్స అందించారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించలేదు.
రిపోర్ట్స్ ప్రకారం, బుమ్రా గాయం నుండి దాదాపు కోలుకున్నట్లు మెడికల్ టీమ్ తెలిపినా, అతను ఎటువంటి ఇబ్బందీ లేకుండా బౌలింగ్ చేస్తాడనే హామీ ఇవ్వలేదు. అందుకే, భవిష్యత్ పర్యటనల దృష్ట్యా అతనికి ఇంకా కొంత కాలం విశ్రాంతి ఇవ్వడం జరిగింది.
ఇది కూడా చదవండి: IND vs ENG 3rd ODI: నేడు అహ్మదాబాద్లో భారత్ vs ఇంగ్లాండ్ 3వ వన్డే
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వెంటనే ఐపీఎల్ మొదలవుతుంది మరి బుమ్రా అక్కడ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడతాడా లేదా నేరుగా ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా అన్నది చూడాలి. అయితే ఇప్పుడు బుమ్రా స్థానంలో మాత్రం కేవలం రెండు వన్డేల అనుభవం ఉన్న హర్షిత్ రానా జట్టులోకి వచ్చాడు.
మరక ఆసక్తికర విషయం ఏమిటంటే ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి బ్యాక్ అప్ ఓపెనర్ గా ఎంపికైన యశస్వి జైస్వాల్ అనూహ్యంగా తన స్థానాన్ని కోల్పోయాడు. తాజాగా సత్తా చాటుతున్న వరుణ్ చక్రవర్తిని అతని స్థానంలో ఎంపిక చేసి ఇతనిని ప్రయాణం చేయని రిజర్వ్ గా ఉంచారు. కాబట్టి ఎవరైనా గాయం పాలై ఖచ్చితంగా వారి స్థానంలో ఇతను కావాలి అనుకుంటే మాత్రం దుబాయ్ బయలుదేరుతాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడే టీమిండియా తుది జట్టుని ఒకసారి చూస్తే:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా.

