Janhvi Kapoor: మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగిన ఒక దారుణమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తూర్పు కల్యాణ్ ప్రాంతంలోని శ్రీ బాల చికిత్సాలయం అనే పిల్లల ఆసుపత్రిలో ఒక రిసెప్షనిస్ట్‌పై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తీవ్రంగా స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతడిని వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
సోమవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గోకుల్ ఝా అనే వ్యక్తి తన బిడ్డను (మరో కథనం ప్రకారం తల్లిని) డాక్టర్‌కు చూపించేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ క్యూ పద్ధతి పాటించకుండా నేరుగా డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిని రిసెప్షనిస్ట్ సోనాలి కలసరే అడ్డుకుని, అపాయింట్‌మెంట్ లేకపోతే లేదా క్యూలో రావాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన గోకుల్, సోనాలిపై దాడికి తెగబడ్డాడు. ఆమెను కాలితో తన్నడమే కాకుండా, జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Also Read: Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఏకంగా రూ.3 వేల కోట్లు
అయినప్పటికీ, జాన్వీ కపూర్ ఈ దాడిని ఏమాత్రం సహించలేదని తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. “ఇలాంటి ప్రవర్తన సరైందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? అవతలి వ్యక్తిపై ఎలా చేయి ఎత్తగలుగుతారు? మానవత్వం లేకుండా చేసిన ఈ పనిపై కనీసం పశ్చాత్తాపం, అపరాధభావం ఉండదా? ఇది చాలా అవమానకర చర్య. ఇలాంటి ప్రవర్తనను మనం ఎన్నటికీ క్షమించకూడదు. ఈ ఘటనను ఖండించి అతడిని శిక్షించకపోతే అది మనకే సిగ్గుచేటు. ఈ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే” అని జాన్వీ తీవ్ర పదజాలంతో రాసుకొచ్చారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి అనంతరం తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం తీసేసి, జుట్టు కత్తిరించుకున్న నిందితుడు గోకుల్ ఝాను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆసుపత్రులలో సిబ్బంది భద్రత, అలాగే ప్రజల సహనంపై తీవ్ర చర్చకు దారితీసింది.

