Jammu Kashmir: మరో 26/11.. ఇప్పటివరకు 26 మంది మృతి

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్ ఘోర ఘటనకు వేదికైంది. ఈ ప్రాంతంలో సందర్శనకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ దాడితో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణానికి లోనైంది.

అనధికారిక సమాచారం ప్రకారం, ఈ దాడిలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. తీవ్రంగా గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఈ దాడి చోటు చేసుకున్న ప్రదేశంలో విషాద దృశ్యాలు తారసపడ్డాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు పర్యాటకులు ఉలిక్కిపడి పరుగులు తీశారు. ఓ మహిళ చేసిన “దయచేసి నా భర్తను కాపాడండి… ఆయనను బతికించండి” అనే ఆర్తనాదాలు, అక్కడి భయానక వాతావరణాన్ని ప్రతిబింబించాయి. కానీ కొద్దిసేపటికే ఆమె భర్త మృతదేహంగా పక్కనే కనిపించడం, ఆమెకు తీరని వేదనను మిగిల్చింది. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె బాధపై తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక, మరో మహిళ రక్తమరకలతో నిస్సహాయంగా నిలిచిన దృశ్యాలు దృష్టిని ఆకర్షించాయి. “మేము టిఫిన్ తింటుండగా ఓ వ్యక్తి వచ్చి నా భర్తపై కాల్పులు జరిపాడు” అంటూ ఆమె కళ్ళతడితో తెలిపిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ దాడిలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఆయన భార్య, కుమారుడి కళ్లెదుటే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *