పాకిస్థాన్ కు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది నీ కర్మ ఫలితమని, ప్రపంచాన్ని నిందించవద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పాకిస్తాన్ జిడిపిని, రాడికలిజం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మాత్రమే కొలవవచ్చని చెప్పారు. దాని కోసం ప్రపంచాన్ని నిందించలేనని, ఇది వారి కర్మ అని అన్నారు. కొన్ని దేశాలు మన నియంత్రణలో లేవు, కొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా హానికరమైన పరిణామాలను కలిగించే నిర్ణయాలు తీసుకుంటాయని అందుకు పాకిస్తాన్ ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పారు.
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాద విధానం ఎప్పటికీ విజయవంతం కాదనీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చిన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ప్రజలు తమ స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం కోసం శతాబ్దాలుగా పోరాడుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా చర్చలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
షెహబాజ్ షరీఫ్ ప్రకటనను భారత్ తీవ్రంగా విమర్శించింది. భారత రాయబారి భావికా మంగళానందన్ మాట్లాడుతూ.. ప్రపంచానికి తెలిసినట్లుగానే పాకిస్థాన్ తన పొరుగుదేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుందని, అలాంటి దేశం హింస గురించి ఎక్కడైనా మాట్లాడడం కపటమేనని అన్నారు.

