Jagga reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబ నేపథ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. రాహుల్ గాంధీ కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని, త్యాగాల చరిత్ర లేని బీజేపీ, త్యాగాల కుటుంబంపై బురద జల్లడం విడ్డూరమని అన్నారు.
మోదీ, అమిత్ షా కుటుంబ పెద్దలను అడిగితే గాంధీ కుటుంబ గొప్పతనం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. “భర్త ఏ కులం అయితే భార్యది అదే కులం అవుతుంది… సోనియా గాంధీ ఈ దేశానికి చెందిన మహిళే” అని స్పష్టం చేశారు.
రాజీవ్ గాంధీ మరణం తరువాత సోనియా గాంధీ అజ్ఞాత జీవితం గడిపి, ప్రజల కోరిక మేరకే రాజకీయాల్లోకి వచ్చారని, ప్రధాని పదవిని కూడా త్యజించారని గుర్తుచేశారు. “బీజేపీ నేతలు అలాంటి త్యాగం చేయగలరా?” అని ప్రశ్నించారు.
సోనియా, రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా బీజేపీ నాయకులు సరిపోరని జగ్గారెడ్డి విమర్శించారు. వాజ్‌పేయి, అద్వానీ హయాంలో ఉన్న విలువలు ఇప్పుడు బీజేపీలో లేవని అన్నారు. “దొంగ ఓట్ల వల్లే బీజేపీ మూడుసార్లు అధికారంలోకి వచ్చింది” అని ఆరోపిస్తూ, ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు.