Jacqueline Fernandez

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసు: సుప్రీంకోర్టులో నటి జాక్వెలిన్‌కు ఎదురుదెబ్బ

Jacqueline Fernandez: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఈసీఐఆర్ (Enforcement Case Information Report) ను రద్దు చేయాలని ఆమె చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో ఆమె ఈడీ కేసులో విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఈడీ కేసును కొట్టివేయడానికి నిరాకరించగా, ఆ తీర్పును సవాలు చేస్తూ జాక్వెలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

జాక్వెలిన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ, జాక్వెలిన్ కేవలం సాక్షి మాత్రమేనని, దోపిడీ చేసిన డబ్బు అని ఆమెకు తెలియదని వాదించారు. అయినప్పటికీ, సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. “స్నేహితుల మధ్య బహుమతులు సాధారణమే, కానీ ఒకరు నేరస్థుడు అయితే దాని పర్యవసానాలను ఎదుర్కోవాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని జాక్వెలిన్‌కు సూచించింది.

Also Read: Avika Gor: పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిన్నారి పెళ్లికూతురు.. అవికా గోర్

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్. ఇతను జైల్లో ఉంటూనే రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి రూ. 200 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ దర్యాప్తులో, సుకేశ్ దోచుకున్న డబ్బుతో జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు సుమారు రూ. 10 కోట్ల విలువైన ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తేలింది. వీటిలో డిజైనర్ బ్యాగులు, వజ్రాభరణాలు, ఒక మినీ కూపర్ కారు వంటివి ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

సుకేశ్ ఒక నేరస్థుడని తెలిసినా, జాక్వెలిన్ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించి, నేరపూరిత డబ్బు ద్వారా లబ్ధి పొందారని ఈడీ తన ఛార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే జాక్వెలిన్‌ను ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో, ఈ కేసు విచారణలో ఆమెపై అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *