Indiramma Indlu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరో కీలక మార్పును తీసుకొచ్చింది. నాలుగు విడతలుగా బిల్లుల చెల్లింపు ప్రక్రియలో స్వల్ప మార్పును తెచ్చిన్టటు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా వెల్లడించారు. ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, చివరి విడత చెల్లింపులో కొంత మార్పు తీసుకొచ్చినట్టు తెలిపారు.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పనిదినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులను లబ్ధిదారుడు స్వయంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్పును తీసుకొ్చింది. ఈ ఇండ్ల నిర్మాణంలో బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తవగానే లబ్ధిదారుడికి రూ.1 లక్ష, రూఫ్‌లెవల్ వరకు వచ్చాక మరో రూ.లక్షను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
Indiramma Indlu: ప్రస్తుతం రూఫ్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ఒకేసారి రూ.2 లక్షల నగదును ప్రభుత్వం చెల్లిస్తున్నది. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా 90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం దానిలోనే రూ.60 వేలను మినహాయించనున్నది. అంటే రూ.2 లక్షలకు గాను రూ.1.40 లక్షలనే చెల్లిస్తుంది. ఉపాధి, మరుగుదొడ్డి పనులు పూర్తయ్యాక, నిర్ధారణ చేసుకున్నాక ఆ మేరకు ఉపాధి జాబ్‌కార్డు ఉండి, పనిచేసిన వారి ఖాతాలోనే ఆ నగదును జమచేస్తుంది.
Indiramma Indlu: ఇంటినిర్మాణం పూర్తయ్యాక మిగతా రూ.లక్ష నగదును లబ్ధిదారుడి ఖాతాలో వేస్తుంది. దీంతో ఒకవేళ ఆ ఇంటి లబ్ధిదారుడి కుటుంబానికి ఉపాధి జాబ్‌కార్డు లేకుంటే ఆ రూ.60 వేల వరకు నష్టపోయే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విషయంపై ఇంకా విధి విధినాలు వచ్చాక పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

