Kamala harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమల హ్యారిస్ ఉన్న విషయం తెలిసిందే. కమలహరిస్ గెలవాలని భారతదేశంలో పూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మొదట అధ్యక్షుడు జో బైడెన్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ, చివరి నిమిషంలో ఆయన తప్పుకోవడంతో అనూహ్యంగా కమలకు అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కింది. ఆ తర్వాత ఆమె ప్రచారంలో దూసుకెళ్లారు.
కమలా హ్యారిస్ తాతగారు పీవీ గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామంలో జన్మించారు. ఇక్కడి ఓ ఆలయంలోనే మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ సమీపంలో చిన్న దుకాణం నిర్వహిస్తున్న గ్రామస్థుడు జి.మణికందన్ తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే తాము సంబరాలు చేసుకుంటామని ఆయన చెప్పారు. 2020లో కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున విజయం సాధించగా ఇదే గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. అప్పుడు కూడా ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు.
ఈరోజు అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోని కమల పూర్వీకులు ఆమె విజయాన్ని కోరుతూ పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఎన్నికల రోజున వాషింగ్టన్‌కు దాదాపు 13,000 కిమీ దూరంలో ఉన్న హిందూ దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు.

