పోలీసుల ప్రకారం రాకేశ్ ఎహగబన్ పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో ఒక మోటెల్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తన మోటెల్ బయట ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో, పరిస్థితిని చల్లార్చడానికి రాకేశ్ బయటకు వెళ్లారు. ఎందుకు గొడవ పడుతున్నారని ఆయన అడగగానే, నిందితుడు తన వద్ద ఉన్న గన్‌తో రాకేశ్‌పై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. తలపై తగిలిన గుండె దెబ్బతో రాకేశ్ అక్కడికక్కడే మరణించారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మోటెల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 37 ఏళ్ల స్టాన్లీ యుజెన్ వెస్ట్‌గా గుర్తించారు. కాల్పుల సమయంలో అక్కడే ఉన్న మరో మహిళపై కూడా అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు గత రెండు వారాలుగా రాకేశ్ మోటెల్‌లోనే అద్దెకు ఉన్నాడని వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Cumin Water Vs Apple Cider Vinegar: జీలకర్ర నీరు Vs ఆపిల్ సైడర్ వెనిగర్.. బరువు తగ్గటానికి ఏది బెస్ట్?
కాల్పుల అనంతరం వెస్ట్ అక్కడి నుంచి పరారయ్యాడు. పిట్స్‌బర్గ్‌లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో అతడి ఆచూకీని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, యుజెన్ వెస్ట్ పోలీసులపైనా కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా, నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హత్య, హత్యాయత్నం, అక్రమంగా ఆయుధం కలిగి ఉండడం వంటి పలు కేసులు అతనిపై నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం అమెరికాలోనే మరో భారతీయుడు.. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి పోలె చంద్రశేఖర్ కూడా కాల్పుల్లో మరణించిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా భారతీయులపై జరుగుతున్న ఈ దారుణ ఘటనలు అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేపుతున్నాయి.