Miss World 2025: ప్రపంచ సుందరి కిరీటం కోసం హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. మొత్తం 109 దేశాల నుంచి విచ్చేసిన అందగత్తెల మధ్య గట్టి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు ప్రస్తుతం టాలెంట్ ప్రదర్శన దశను దాటి, క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటున్నాయి.
సోమవారం నిర్వహించిన టాలెంట్ కాంపిటిషన్ రెండో రౌండ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబర్చిన 48 మంది సుందరీమణులు తదుపరి దశకు ఎంపికయ్యారు. అయితే, ఇంకా నేపాల్, హైతీ, ఇండోనేసియా దేశాల సుందరీమణులు తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. వీరి ప్రదర్శన అనంతరం, అర్హత సాధించిన వారు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటారు.
ఈ పోటీల్లో అమెరికా కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా అనే ఖండాల ఆధారంగా కాంటినెంటల్ క్లస్టర్లుగా విభజించి ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతిభ ఆధారంగా ప్రతి ఖండం నుంచి ఉత్తమ వ్యక్తిత్వం, నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇది కూడా చదవండి: Short News: తెలంగాణ రాజ్‌భవనలో చోరీ
ఈ క్రమంలో, మంగళవారం మరియు బుధవారం హైదరాబాద్ లోని టీ హబ్ వేదికగా కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నాయి. ఈ ఫినాలేలు పోటీల ఉత్కంఠను మరింత పెంచనున్నాయి. ప్రతి ఖండం నుంచి ఎంపికయ్యే అత్యుత్తమ సుందరీమణులు ఫైనల్ దశకు చేరుతారు.
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ టైటిల్ కోసం సాగుతున్న ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ప్రతిభావంతురాలికి ఇది ఒక ప్రత్యేక అవకాశం. హైదరాబాద్‌కు ఈ వేదిక లభించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలుస్తోంది.
ముందు ముందు ఇంకా ఆసక్తికర ఘట్టాలు ఎదురుచూస్తున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రపంచ దృష్టి అంతా ప్రస్తుతం హైదరాబాద్ వైపు ఉన్న ఈ పోటీలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.