Karimnagar: కరీంనగర్ రామడుగులో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు సంచలనం రేపుతోంది. వ్యాపారాల్లో వరుస నష్టాలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు కోల్పోవడం వల్ల తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన నరేశ్ అనే వ్యక్తి, వాటి నుంచి బయటపడేందుకు అసహ్యమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇంట్లో తనతో కలిసి ఉన్న మానసిక స్థితి లేని అన్న వెంకటేష్‌ను చంపితే, బీమా డబ్బులతో అప్పులు తీర్చేయొచ్చని ప్లాన్ చేసుకున్నాడు. ఈ ఆలోచన అతడిని నేరానికి పాల్పడేలా చేసింది.
రెండు నెలల వ్యవధిలోనే నాలుగు ప్రైవేట్ కంపెనీలు, ఒక ప్రభుత్వ సంస్థ కలిపి సుమారు రూ.4.14 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు అన్న పేరుపై చేయించాడు. బయటి వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా, ప్రమాదంలా చూపించి అన్నను చంపాలని నరేశ్ అనుకున్నాడు. అదే సమయంలో, తన వద్ద ఉన్న రూ.7 లక్షలు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్న రాకేశ్‌ని కూడా ఈ పథకంలోకి తీసుకున్నాడు. సహాయం చేస్తే అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని చెప్పి అతన్ని ఒప్పించాడు. అలాగే, టిప్పర్ డ్రైవర్ ప్రదీప్‌కు రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి తన కుట్రలో భాగం చేశాడు.
Also Read: Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల్లో గందరగోళం.. ప్రయాణికుల అష్టకష్టాలు
గత నెల 29న రాత్రి, నరేశ్, రాకేష్, ప్రదీప్ ముగ్గురూ కలసి అన్నను చంపేందుకు పథకం రూపొందించారు. గ్రామ శివారులో టిప్పర్ చెడిపోయిందని డ్రైవర్ ప్రదీప్ చెప్పిన వెంటనే, నరేశ్ తన అన్న వెంకటేష్‌ను అక్కడికి పంపాడు. జాకీ పెట్టేందుకు టిప్పర్ టైర్ల దగ్గర పడుకోబెట్టి వాహనాన్ని ముందుకు తలపై నుంచి టిప్పర్ చక్రాలు వెళ్లడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని నటిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
తరువాతి రోజు బీమా సంస్థ ప్రతినిధులు నష్టపరిహారం కోసం విచారణకు రాగా, నరేశ్ చెప్పిన విషయాల్లో అనుమానాస్పద అంశాలు కనిపించాయి. వెంటనే వారు ఈ అంశాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి మొత్తం వ్యవహారం బయటక పెట్టారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నను హత్య చేసిన నిజం బయటపడడంతో నరేశ్‌తో పాటు రాకేశ్, ప్రదీప్‌లను అదుపులోకి తీసుకున్నారు.
కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం, అప్పుల ఒత్తిడితో ఓ వ్యక్తి ఎంత క్రూరంగా మారగలడనే విషయాన్ని ఈ ఘటన బయటపెట్టిందని తెలిపారు. సొంత అన్న ప్రాణాలకే విలువ ఇవ్వకుండా డబ్బుల కోసం కుట్ర పన్నడం కుటుంబం, గ్రామం మొత్తాన్నే కలిచివేసింది.

