Imran Khan: ఆసియా కప్ 2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ వరుసగా ఓడిపోయిన తర్వాత, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌లపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్, తన సోదరి అలీమా ఖాన్ ద్వారా ఈ వ్యాఖ్యలను మీడియాకు తెలియజేశారు. భారత్‌పై పాకిస్తాన్ గెలవాలంటే ఒకటే మార్గం ఉందని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు. అదేంటంటే… పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఇద్దరూ ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు దిగాలి.
అంపైర్లుగా పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫాయెజ్ ఇసా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సికిందర్ సుల్తాన్ రాజా వ్యవహరించాలి. ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ఫరాజ్ డోగర్ థర్డ్ అంపైర్‌గా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల ద్వారా, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పాకిస్తాన్లో క్రికెట్‌తో పాటు రాజకీయాలు, న్యాయవ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అసమర్థత, బంధుప్రీతి కారణంగా పాకిస్తాన్ క్రికెట్ దెబ్బతింటోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Local Body Elections: స్థానిక ఎన్నికలకు నేడు రిజర్వేషన్ల ఖరారు!
జనరల్ అసీమ్ మునీర్ తన పార్టీ (పీటీఐ)కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2024 ఎన్నికలలో మోసానికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్ గతంలో ఆరోపించారు. క్రికెట్ ఓటముల నేపథ్యంలో ఈ రాజకీయ వైరుధ్యాలను ముడిపెట్టి ఇమ్రాన్ ఖాన్ తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. ఇమ్రాన్ ఖాన్, 1992లో పాకిస్తాన్‌కు ఏకైక వన్డే ప్రపంచ కప్‌ను అందించిన కెప్టెన్‌గా, పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఒక దిగ్గజంగా నిలిచిపోయారు. అతని ఈ తాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.