ICC: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మూడు వన్డేల సిరీస్లో ఆ జట్టుకు ఒక భారీ ఓటమితో పాటు జరిమానా కూడా పడింది. ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 342 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 414 పరుగుల భారీ స్కోరు సాధించింది. 415 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది. కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది. పరుగుల పరంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమిగా నమోదైంది.
ఇది కూడా చదవండి: Crime News: మంచిర్యాల జిల్లాలో ఘోరం.. లవర్ లేదనే బాధతో ప్రియుడు ఏం చేశాడంటే!
ఇంతకు ముందు భారత్ శ్రీలంకపై 317 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ రికార్డును కలిగి ఉంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుకు 5% మ్యాచ్ ఫీజు జరిమానా కూడా విధించారు. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోవడమే ఈ జరిమానాకు కారణం. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు కెప్టెన్ తెంబా బావుమా, జట్టు సభ్యులపై ఐసీసీ ఈ జరిమానా విధించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలలో ఒకరైన టీమిండియా మాజీ పేసర్ శ్రీనాథ్ జవగళ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక సారథి బవుమా తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే ఐదు శాతం జరిమానా ఖరారైంది.
ఈ భారీ ఓటమి, జరిమానా దక్షిణాఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయితే, ఈ ఓటమితో కూడా దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకోవడం గమనార్హం. ఇంగ్లాండ్ గడ్డపై 27 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ గెలవడం దక్షిణాఫ్రికాకు ఒక అరుదైన ఘనత.