Champions Trophy: పాకిస్థాన్ లో ఆడేది లేదని ఇప్పటికే బిసిసిఐ వెల్లడించినా, చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పీటముడి బిగిసినా… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరు మారలేదు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో చాంపియన్స్ ట్రోఫీ పర్యటన చేపట్టాలనుకున్న పిసిబి ప్రయత్నాలకు ఐసీసీ గండి కొట్టింది. బిసిసిఐ అభ్యంతరంతో ఐసీసీ షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పీవోకేలో ట్రోఫీ టూర్ పేరిట భారత్ ను కవ్వించాలనుకున్న పాకిస్థాన్ ప్రయత్నం విఫలమైంది.
Champions Trophy: పాకిస్థాన్ లో ఆడేది లేదని, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అక్కడికి వెళ్లబోమని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు నిరాకరిస్తున్న పరిస్థితుల్లో అసలు టోర్నీ నిర్వహణే సందిగ్దంలో పడింది. దీనికి తోడు క్రికెట్ ను అడ్డుపెట్టుకుని పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటన నిర్వహించి భారత్‌ను కవ్వించాలని దాయాది ప్రయత్నించడం, దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ కన్నెర్ర చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీఓకేలో తలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటనను నిలిపివేసింది.
ఇది కూడా చదవండి: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో.. మరో సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా
Champions Trophy: నవంబర్ 16న ఇస్లామాబాద్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ పర్యటన ప్రారంభం కానుంది. ట్రోఫీ టూర్ అద్భుత పర్యాటక ప్రాంతాలైన స్కర్దు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్‌లో సాగుతుందని ఎక్స్ ఖాతాలో పీసీబీ పోస్టు చేసింది. స్కర్దు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ నగరాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం స్పందించాలని కోరారు. దీంతో పీఓకేలో ట్రోఫీ పర్యటనను నిలిపివేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ట్రోఫీ పర్యటనపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇలాంటి ప్రాంతాలకు ట్రోఫీని తీసుకెళ్లేందుకు ఐసీసీ అనుమతించదని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.