TG High Court: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల వివాదం, కోర్టు ధిక్కరణ (Contempt) కేసులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా శుక్రవారం (ఆగస్టు 7) తెలంగాణ హైకోర్టు ముందు హాజరయ్యారు.
లాయర్ సుబ్రమణ్యం యాదవ్ వేసిన కంటెంప్ట్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఎదుట ఆయన హాజరయ్యారు. గతంలో కోర్టు ఆదేశించినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం, ఫారం-1 నోటీసులు జారీ చేస్తూ కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేయడంతో పోలీసులు ఆయనను కోర్టుకు తీసుకువచ్చారు.
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఈ కేసు విచారణ సందర్భంలో రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలు, సంక్షేమంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది..
-
ఉచితాలతో సమాజానికి నష్టం: ఉచిత పథకాల వల్ల సమాజానికి తీవ్ర నష్టం జరుగుతోంది. కోటీశ్వరులు, ఉన్నతాధికారులు కూడా ‘రైతుబంధు’ వంటి పథకాల లబ్ధిని పొందుతుండటం చాలా బాధాకరం అని కోర్టు వ్యాఖ్యానించింది.
-
ఖజానాపై భారం: వర్గీకరణ లేకుండా అందరికీ ఇచ్చే ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
నిధుల చెల్లింపుపై ఐఏఎస్ వివరణ – తదుపరి విచారణ ఆగస్టు 19కి!
విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా కోర్టుకు వివరణ ఇస్తూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల్లో ఇప్పటికే సగం నిధులను విడుదల చేశామని తెలిపారు. మిగిలిన నిధులను కూడా విడతల వారీగా చెల్లిస్తామని కోర్టుకు వెల్లడించారు.
ఆయన ఇచ్చిన హామీని, అండర్‌టేకింగ్‌ను పరిశీలించిన హైకోర్టు రూ.5,000 పర్సనల్ బాండ్‌పై ఆయనను విడుదల చేస్తూ, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి (ఆగస్టు 19) వాయిదా వేసింది.
