Hyderabad:హైదరాబాద్ నగరంలోని ప్రముఖ స్టార్ హోటల్ అయిన తాజ్‌బంజారా హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు ఝలక్ ఇచ్చారు. రెండు సంవత్సరాల నుంచి హోటల్ యాజమాన్యం పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఏకంగా ఆ హోటల్‌ను సీజ్ చేశారు. బకాయిలు చెల్లించాల్సిందిగా జీహెచ్ఎంసీ నుంచి పలుమార్లు నోటీసులు జారీచేసినా నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అందుకే చర్యలు తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చిచెప్పారు.
Hyderabad:పన్ను బకాయిలు చెల్లించాలని ఆఖరుకు రెడ్ నోటీస్ కూడా జారీ చేసినట్టు ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. అయినా తాత్సారం చేస్తూ పన్ను చెల్లించనందుకు శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని స్టార్ హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసి నోటీసులను అంటించారు. రెండేళ్లలో తాజ్ బంజారా హోటల్ పన్ను మొత్తం రూ.1.43 కోట్లకు చేరిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గేట్లకు తాళాలు వేసి, సీల్ చేసిన వీడియోలు సోషల్ మీడియా వేదికలపై హల్‌చల్ చేస్తున్నాయి.
Hyderabad:హైదరాబాద్ నగరంలో ప్రముఖ స్టార్ హోటళ్లలో ఒకటైన ఈ తాజ్ బంజారా నిత్యం పర్యాటకలు రద్దీతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ హోటల్‌కు వ్యాపార, సినీ, విదేశీ ప్రముఖులు అధిక సంఖ్యలో వస్తుంటారు. హైదరాబాద్ నగరంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే క్రీడాకారులకు ఇక్కడే బస ఏర్పాటు చేస్తారు.
Hyderabad:ఇటీవల రాజకీయ సమావేశాలకు కూడా ఈ హోటల్ వేదికగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాద్ కు వస్తే ఈ హోటల్‌లో బస చేసేందుకే ఆసక్తిని చూపుతారు. అలాంటి హోటల్ బకాయిలు కోటిన్నర దాకా చేరడం గమనార్హం. ఆ బకాయిల కోసం ఆరు సార్లు నోటీసులు పంపినా స్పందన కరువైందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం గమనార్హం. హోటల్ యాజమానులు మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.