Hyderabad: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకం మరింత విస్తృత స్థాయిలో అమలవుతోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దరఖాస్తు ప్రక్రియ
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాల్లో మాన్యువల్‌గా దరఖాస్తులు సమర్పించాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి వివరించారు.
పథకం అమలుపై అధికారుల సమీక్ష
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులు తో సమావేశమై రాజీవ్ యువ వికాసం అమలును సమీక్షించారు.
ఉప ముఖ్యమంత్రి సూచనలు
రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల నిధులతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని, అధికారులు సమర్థవంతంగా పథకాన్ని అమలు చేయాలని సూచించారు.
నాణ్యత పెంపునకు సూచనలు
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గతంలో స్వయం ఉపాధి పథకాలు అనుకున్న స్థాయిలో అమలు కాలేదని పేర్కొన్నారు. అందుకే, రాజీవ్ యువ వికాసం పథకాన్ని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారిని నియమించి పథకాన్ని పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 92,492 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించామని తెలిపారు. అయితే, దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాన్యువల్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిచామని వివరించారు.