Hyderabad: అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా 2,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
బుధవారం ఉదయం, అసెంబ్లీ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెక్‌డొనాల్డ్స్ చైర్మన్, సీఈఓ క్రిస్ కెంప్‌కెజెన్స్కీ (Chris Kempczinski) మరియు సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు.
హైదరాబాద్‌ను ఎంపిక చేసిన మెక్‌డొనాల్డ్స్
గ్లోబల్ ఆఫీస్ స్థాపన కోసం పలు రాష్ట్రాలు పోటీ పడగా, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతులైన నిపుణులు, మంచి జీవన ప్రమాణాలు ఉన్నాయని మెక్‌డొనాల్డ్స్ సీఈవో క్రిస్ కెంప్‌కెజెన్స్కీ తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ రంగానికి మేలు
ఈ ఒప్పందంతో స్థానిక రైతులకు కూడా లాభం కలుగనుంది. మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను తెలంగాణ రైతులు సరఫరా చేయగల అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంలో మరియు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.
తెలంగాణ యువతకు కొత్త అవకాశాలు
ప్రభుత్వం గత 15 నెలల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని సీఎం వివరించారు. సంస్థకు అవసరమైన ఉద్యోగులను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇచ్చి నియమించుకోవచ్చని సూచించారు.
మెక్‌డొనాల్డ్స్ కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు
ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్ నిర్వహిస్తున్న సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను సీఈవో వివరించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇక్కడ కూడా ఈ తరహా కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు రానున్నారు.
ఈ భారీ పెట్టుబడి ఒప్పందం హైదరాబాద్‌ను అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మరింతగాఎదిగేలా చేయనుంది.