Hyderabad: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మృతిచెందిన పశువులకు కూడా ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలని నిర్ణయించారు.
జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సీఎం సూచించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వరదల కారణంగా ఏర్పడిన నష్టంపై సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని కూడా రేవంత్ ఆదేశించారు.
ఈ నిర్ణయాలతో వరద బాధిత కుటుంబాలకు కొంత భరోసా కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

