Hyderabad: సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన డ్రెస్సింగ్ సెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, “కలెక్టర్‌ను చూసే భయంగా ఉంది. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారు?” అని వ్యాఖ్యానించింది.
సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే ఆదేశాలను అమలు చేయకపోగా, ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి కవితపై తప్పుడు కేసులు బనాయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై న్యాయం కోసం కవిత మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా, గతంలోనూ కలెక్టర్ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన వేషధారణపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. “కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా? కోర్టుకు ఇలా వస్తారా?” అంటూ ప్రశ్నించింది. తాజాగా మరోసారి అదే అంశంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, కలెక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
అలాగే వనబట్ల కవితకు ఇచ్చిన నష్టపరిహారం తీర్పును యథావిధిగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం, సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.