Hyderabad : తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ శనివారం కలిశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు, ఇందిరమ్మ పథకంపై ఆయన మంత్రితో చర్చించారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్, “బీజేపీ ఎంపీలం అయినప్పటికీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తాము. తెలంగాణకు ఎక్కువ నిధులు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. యూరియా సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం” అన్నారు.
రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలని సూచించిన ఈటల, “అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేయడం మానేయాలి” అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని ఆరోపిస్తూ, “మాకు తెలిసిన పేదల జాబితాను మంత్రికి అందించాం. రూ. 5 లక్షలతో ఇల్లు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కనీసం రూ. 12 లక్షలు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.
అలాగే, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ఆలస్యం వల్ల వాటిలో దొంగలు నివసిస్తున్నారని విమర్శించారు. జవహర్ నగర్‌లో మాజీ సైనిక ఉద్యోగులకు చెందిన భూముల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చడం సరికాదని స్పష్టం చేశారు.