Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం (TANHA) ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం పలుమార్లు హామీలు ఇచ్చినా, వాస్తవ పరిష్కారం జరగకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. గత 20 రోజులుగా ఆరోగ్యశాఖ మంత్రి, ఏహెచ్సీటీ సీఈఓలతో తాము తరచూ సమావేశాలు నిర్వహించినా సమస్యలు తీర్చలేకపోయారని స్పష్టం చేశారు.
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమస్యల పరిష్కారానికి కృషి చేసినా, బకాయిల చెల్లింపుల విషయంలో పురోగతి లేకపోవడంతో మంగళవారం (సెప్టెంబర్ 16) రాత్రి 11:59 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నామని వెల్లడించారు.
రోగులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రజలు మరియు లబ్ధిదారులు తమ సమస్యను అర్థం చేసుకొని మద్దతు ఇవ్వాలని టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.