Huzurabad: హుజూరాబాద్ బీజేపీలో చీలిక ఏర్పడింది. ఒక వర్గం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి మద్దతిస్తుండగా, మరోవర్గం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గంగా ఉన్నారు. అయితే హుజూరాబాద్‌లో ఓటమి, మల్కాజిగిరికి ఎంపీ కావడంతో హుజూరాబాద్‌లో ఈటల వర్గం పరిస్థితి డోలాయమానంలో పడింది. బండి సంజయ్ వర్గంతో పొసగని పరిస్థితి ఏర్పడింది.
Huzurabad: తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు హుజూరాబాద్ బీజేపీలో చీలికను స్పష్టంచేసింది. గత ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోనే తనకు తక్కువ ఓట్లు వచ్చాయని, కావాలని తన ఓటమికి అక్కడి బీజేపీ నేతలు పాటుపడ్డారని, వారిని స్థానిక ఎన్నికల్లో ఎలా ప్రోత్సహిస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఫలితంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గౌతంరెడ్డి రాజీనామా చేశారు.
Huzurabad: ఆ తర్వాత ఇప్పటి వరకు ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు, కార్యకర్తలు డోలాయమానంలో పడ్డారు. తమ పరిస్థితి ఏమిటని సంశయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈటల రాజేందర్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు ఈ రోజు (జూలై 19) శామీర్‌పేటలోని ఈటల ఇంటికి వచ్చారు. ఆయనతో భేటీ అయి ఏదో ఒకటి తేల్చుకునేందుకే సిద్ధమై వచ్చారు. ఇప్పటికీ సమావేశం కొనసాగుతూనే ఉన్నది.
Huzurabad: ఇప్పటివరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్‌కు దక్కుతుందని భావించిన ఆయన వర్గం.. ఇప్పుడు మరో నేతకు దక్కడంతో కూడా నిరాశతో ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈటలకు ఇవ్వలేదని బీసీ, ఇతర వర్గాలు అసమ్మతితో ఉన్నాయి. అటు హుజూరాబాద్‌లోనూ రగిలిపోతున్నారు. ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్న రీతిలో రాష్ట్రవ్యాప్తంగా వర్గాలు నడుస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తున్నది.
Huzurabad: ఏదేమైనా హుజూరాబాద్ పగ్గాలు ఈటల వర్గానికి ఇస్తారా? సరే సరి. లేదంటే మూకుమ్మడిగా రాజీనామా చేసి మరో పార్టీలో చేరడమా? ఈటల సొంత పార్టీ పెడితే అప్పటి వరకూ వేచి ఉండటమా? అన్న యోచనలో ఉన్నట్టు ఆ వర్గం ద్వారా తెలుస్తున్నది. ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్ బీజేపీ క్యాడర్ వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది.