Crime News: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాధిక థియేటర్ సమీపంలో ఉన్న బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి భర్త పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోత్కూర్ సమీపంలోని అడ్డగూడూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ (40), అతని భార్య మంజుల (35) ఇద్దరు బాబులు, ఒక పాపతో కలిసి బొంబాయి నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ వచ్చారు. గత కొద్ది రోజులుగా వీరు కుషాయిగూడలోని మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న శంకర్ అక్క ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు.
గురువారం అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో శంకర్, తన భార్య మంజులను ఒక కత్తితో విచక్షణారహితంగా నరికాడు. ఆమె అరుపులు విన్న ఇంట్లో వారంతా లేచి చూసేసరికి మంజుల తీవ్ర రక్తస్రావంతో నేలకొరిగింది. ఈ దృశ్యంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు తేరుకునేలోపే శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో కుషాయిగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన మంజుల అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, భార్యపై అనుమానంతోనే శంకర్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు శంకర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు కుషాయిగూడ పోలీసులు వెల్లడించారు. ఈ హత్యా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయితేనే తెలుస్తాయని పోలీసులు తెలిపారు.