Telangana:తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి. ఇప్పటికే హాల్‌టికెట్లను కమిషన్ వైబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇదే నెల 27 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల ప్రారంభానికి ముందు హాల్‌టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ముందస్తుగా ప్రకటించారు. మెయిన్స్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలకు హైకోర్టు తెరదించడంతో అభ్యర్థులకు ఊరట లభించింది.
Telangana:మెయిన్స్‌లో ఏడు పరీక్షలు ఉంటాయి. వాటిలో 21న జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్), 22న జనరల్ ఎస్సే (పేపర్-1), 23న హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ (పేపర్-2), 24న ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ (పేపర్-3), 25న ఎకానమీ అండ్ డవలప్మెంట్ (పేపర్-4), 26న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్ (పేపర్-5), 27న తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ (పేపర్-6) పరీక్షలు ఉంటాయి.
Telangana:మెయిన్స్ పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత పరీక్షా కేంద్రాలను మూసి వేస్తారు. ఆ తర్వాత వచ్చేవారిని ఎవరినీ లోనికి అనుమతించరు. అభ్యర్థి తొలిపరీక్షకు వినియోగించిన హాల్ టికెట్నే చివరి పరీక్ష వరకు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
Telangana:రాష్ట్రంలోని 18 శాఖల్లో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారిని 1:50 చొప్పున 31,382 మందిని మెయిన్స్ పరీక్షల కోసం ఎంపిక చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలను చూసుకోవాలని కమిషన్ అధికారులు సూచించారు.
Telangana:హాల్ టికెట్లలో ఎవైనా పొరపాట్లు ఉంటే కమిషన్ కార్యాలయ పనివేళల్లో 040-23542185 లేదా 040-23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. లేదా హెల్ప్ డెస్క్‌లను ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.