Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో గగనతలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరకాశీ జిల్లా గంగోత్రి దిశగా వెళ్తున్న ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9 గంటల సమయంలో కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
స్థానికులు, సిబ్బంది అప్రమత్తం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ శకలాల మధ్య నుంచి ప్రయాణికులను వెలికితీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. గాయపడినవారిని హెలికాప్టర్ ద్వారా డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ind Operation Sindoor: భారత చరిత్రలో గుర్తుండిపోయే మైలురాయి!
ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపం, పైలట్ తప్పిదం అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నదని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
ప్రభుత్వం స్పందన
ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.